హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం గతాన్ని ఒక అనుభవంగా, ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళికలను రచించుకుని అద్బుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని తయారు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే ఈ విజన్ పత్రాన్ని జాతికి అంకితం చేయబోతున్నామని సీఎం ప్రకటించారు. దేశంలోనే భారత్ ఫ్యూచర్ సిటీ ఓ రోల్ మోడల్ గా మారనుందన్నారు.
ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరిగిందని వివరించారు. తెలంగాణను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి విజన్‌తో పాటు దాన్ని అమలు చేసే వ్యూహంతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి, ఇతర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే స్పష్టమైన పాలసీ ఉండాలని అన్నారు. ప్రపంచ స్థాయి పేరెన్నికగన్న దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు, ప్రతిష్టాత్మక సంస్థలను భాగస్వామ్యం చేసి, ప్రతి అంశాన్ని లోతుగా క్షుణ్ణంగా విశ్లేషించి డాక్యుమెంట్‌లో భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేశామని చెప్పారు రేవంత్ రెడ్డి . రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి తెలంగాణను మూడు విభాగాలుగా విభజించి స్పష్టమైన ప్రణాళికలను తయారు చేసినట్లు తెలిపారు.
