తిరుమల : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. మూల విరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు సీఈసీ కుటుంబానికి ఘన స్వాగతం పలికారు . అనంతరం ఆయన గర్భాలయంలోని మూలవిరాట్టు శ్రీ వేంకటేశ్వర స్వామిని, వకుళమాతను, ఆనంద నిలయ విమాన వేంకటేశ్వరుని, భాష్యకార్ల సన్నిధిని, యోగ నరసింహ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. పూజలు పూర్తయ్యాక, రంగనాయకుల మండపంలో వేద పండితులు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో ఆయనకు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి (DyEO) లోకనాథం, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా భారత దేశ చరిత్రలో ప్రస్తుతం కొలువు తీరిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై వచ్చినన్ని ఆరోపణలు ఇంకే సీఈసీపై రాలేదు. గతంలో తమిళనాడుకు చెందిన టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్న సమయంలో గడగడ లాడించాడు. ప్రజా ప్రతినిధులకు నిద్ర లేకుండా చేశాడు. ఆయన కొలువుతీరాకే సీఈసీకి ఇన్ని పవర్స్ ఉంటాయా అని జనం తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో సీఈసీనే సూపర్ పవర్ అని తేల్చి పారేశారు. ఆయన ఎవరినీ ఖాతరు చేయలేదు. కానీ ఇప్పుడున్న సీఈసీ పూర్తిగా కేంద్ర సర్కార్ కు, బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు చేశాయి విపక్షాలు.
