హైదరాబాద్ : కోట్లాది మంది భక్తులు కలిగిన తిరుమల పుణ్య క్షేత్రం ఇప్పుడు సవాలక్ష సమస్యలతో సతమతం అవుతోంది. ప్రత్యేకించి టీటీడీ స్వామి వారి దర్శనం కోసం విడుదల చేసే టికెట్లు దొరకక నానా తంటాలు పడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామాజిక మాధ్యమాల వేదికగా. అసలు టీటీడీ దర్శనం టికెట్ల బుకింగ్‌లో ఏం జరుగుతోంది? అంటూ మండిపడుతున్నారు. భక్తుల కోసమే టికెట్లు విడుదల చేస్తున్నామని చెబుతున్న టీటీడీ సాధారణ భక్తులకు టికెట్లు ఎందుకు అందకుండా పోతున్నాయనే దానిపై నోరు మెదపడం లేదు. ఇప్పటికే హిందూ సంఘాలు తీవ్ర స్తాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవలే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బి. వెంకటేశ్వర్లును ఐటీ విభాగానికి ఇంఛార్జ్ బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క నిమిషంలోనే 12 వేల టికెట్లు నాలుగు నిమిషాల్లోనే 60 వేల టికెట్లు పూర్తవడం ఎలా సాధ్యమవుతోంది అని ప్రశ్నిస్తున్నారు భక్తులు. సాధారణ భక్తులు బుకింగ్ ప్రారంభించిన వెంటనే ప్రయత్నించినా టికెట్లు దొరకకపోతే, ఇంత భారీ సంఖ్యలో టికెట్లు ఎవరు, ఎలా బుక్ చేస్తున్నారని అర్థం కాకుండా పోతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దళారులు పెద్ద ఎత్తున టికెట్లు దక్కించుకుంటున్నారనే అనుమానాలు భక్తుల్లో ఎందుకు కలుగుతున్నాయి? టీటీడీ దీనిపై సమగ్ర విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. బుకింగ్ వ్యవస్థలో బాట్స్, ఆటోమేటెడ్ బుకింగ్ లేదా ఇతర మార్గాల ద్వారా టికెట్లు ముందుగానే దక్కించుకుంటున్నారా? అనే దానిపై తేల్చాల్సి ఉంది. దీనిపై టీటీడీ బోర్డు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని భక్తులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
