న్యూఢిల్లీ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టు మద్దతుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రంగంలోకి దిగనుందని స్పష్టం చేశారు. పుష్కరాల నేపథ్యంలో గోదావరి కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరిన వెంటనే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల్ని పంపి కాలుష్య నివారణ చర్యలకు సహకరించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అంగీకారం తెలిపినట్టు చెప్పారు. అటవీశాఖ కామన్ ఫెసిలిటీ సెంటర్ నూతన అరణ్యారామం నిర్మాణంతోపాటు బేస్ క్యాంపుల పెంపు, గ్రేట్ గ్రీన్ వాల్ కి మద్దతు, ఒడిశా నుంచి కుంకీ ఏనుగులు, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి 50 అడవి దున్నలు రాష్ట్రానికి రప్పించేందుకు సహకారం, తగ్గుతున్న ఆడ పులుల పెంపు చర్యలు తదితర 8 అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలిపారు. కేంద్ర అటవీ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశం అయ్యారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల అటవీ శాఖలో అరణ్యారామం పేరిట నిర్మించ తలపెట్టిన కామన్ ఫెసిలిటీ సెంటర్ అరణ్యంకు అనుమతులు మంజూరు చేసినందుకు భూపేంద్ర యాదవ్ కి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చాం. దీంతో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి 8 అంశాలకు మద్దతు కోరాం. నూతన అరణ్యం భవన్ లో మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం హనుమాన్ మానిటరింగ్ సెంటర్, గ్రేట్ గ్రీన్ వాల్ పర్యవేక్షణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ వంటి అత్యాధునిక విభాగాలు ఏర్పాటు కానున్నాయి.
వీటితో పాటు చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోకి సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్న ఏనుగుల రాకపోకల మానిటరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. దీని వల్ల ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించే అవకాశం లభిస్తుంది. దీనితో పాటు నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో బేస్ క్యాంపులు పెంచుకునేందుకు అనుమతి కోరాం. ప్రస్తుతం 90 బేస్ క్యాంపులు ఉండగా ఆ సంఖ్యను 150కి పెంచుకోవాల్సి ఉంది. అందుకోసం 300 మంది గార్డ్స్ అదనంగా అవసరం అవుతారు. గార్డ్స్ గా స్థానిక చెంచు యువతే ఉంటారు. వారు అడవుల్లో సులభంగా తిరిగేందుకు ద్విచక్ర వాహనాలు సహా బేస్ క్యాంపుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి మద్దతు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.


















