Red Sea : ఎర్ర సముద్రంలో సముద్రగర్భ ఆప్టికల్ కేబుల్స్ దెబ్బతినడంతో ఆదివారం (సెప్టెంబర్ 7) భారతదేశం సహా ఆసియాలోని పలు దేశాల్లో ఇంటర్నెట్ సదుపాయం అంతరాయం ఎదుర్కొంది. ఈ సంఘటనకు ఖచ్చితమైన కారణం ఇప్పటికీ వెల్లడికాలేదు.
Red Sea Cable Cut Sensational
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీలో కీలకపాత్ర పోషించే ఎర్ర సముద్రం (Red Sea) కేబుల్స్ నష్టపోవడంతో, ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో సుమారు 17 శాతం వరకు ప్రభావం చూపినట్లు సమాచారం. ఇందులో SEACOM/TGN-EA, AAE-1, EIG వంటి ముఖ్యమైన కేబుల్ వ్యవస్థలు దెబ్బతిన్నట్లు నిపుణులు తెలిపారు.
ఈ అంతరాయం మైక్రోసాఫ్ట్ అజూర్ సేవలపై కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. కంపెనీ ప్రకటన ప్రకారం, ఆసియా-యూరప్ మార్గంలో డేటా ట్రాఫిక్‌లో అంతరాయాలు తలెత్తగా, వినియోగదారుల సమస్యలు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా డేటాను మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. కేబుల్స్ పునరుద్ధరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Red Sea – కేబుల్స్ నష్టం వెనుక కారణాలపై అనుమానాలు
ఎర్ర సముద్రంలో గతంలో జరిగిన సంఘటనలు తరచూ వాణిజ్య నౌకల యాంకర్లు తగలడం వల్లనే కేబుల్స్ దెబ్బతిన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. అయితే, ఈసారి ఉద్దేశపూర్వకంగా విధ్వంసం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, ముఖ్యంగా యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు డిజిటల్ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గాజా యుద్ధంపై ఒత్తిడి తీసుకురావడమే దీని వెనుక ఉద్దేశమని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, హౌతీలు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అంతర్జాతీయ ప్రభావం
ఇంటర్నెట్ యాక్సెస్‌ను పర్యవేక్షించే నెట్‌బ్లాక్స్ నివేదిక ప్రకారం, ఎర్ర సముద్ర కేబుల్స్‌లో సమస్యల కారణంగా భారతదేశం, పాకిస్తాన్, మధ్యప్రాచ్యం సహా అనేక దేశాల్లో కనెక్షన్ నెమ్మదించిందని వెల్లడించింది. ముఖ్యంగా సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో ఉన్న SMW4, IMEWE వ్యవస్థల్లో లోపం చోటుచేసుకుందని తెలిపింది.
ప్రపంచ ఇంటర్నెట్ మౌలిక వసతులలో కీలకమైన ఎర్ర సముద్ర కేబుల్స్ దెబ్బతినడం వల్ల డిజిటల్ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : Today Gold Price : మరోసారి పెరిగిన పసిడి ధరలు



















