హైదరాబాద్ : కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాట చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు భారత రాష్ట్ర సమితి చేపట్టనున్న వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వరుసగా ఏడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలని ఆయన సూచించారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజులపాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారికి సమగ్రంగా దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
పార్టీ నిర్ణయించిన కార్యాచరణను కేవలం కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిలో ఎన్ని అమలయ్యాయి? ప్రజలకు ఇంకా ఏమేం బాకీ ఉన్నాయి? అనే అంశాలను ప్రతి ఇంటికీ చేరేలా వివరించాలని కేటీఆర్ సూచించారు. ప్రతి నాయకుడు తన కార్యక్షేత్రంలో బాధ్యత తీసుకొని ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వారం రోజుల కార్యాచరణకి ముందుగా సెప్టెంబర్ 1న కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జిషీట్‌ను వేస్తూ భవన్లో మీడియా సమావేశం పార్టీ నిర్వహిస్తుందన్నారు. ఆ తర్వాత వరుసగా వారం రోజుల పాటు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం సెప్టెంబర్ 2న కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాన్ని నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని స్పష్టం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ చేసిన హామీల మోసాన్ని ప్రతీకాత్మకంగా ప్రజలకు తెలియ జేసేందుకు భారీ ఫ్లెక్సీల ప్రదర్శనతో పాటు ‘420 హామీలు’ అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇదే సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం ఇంకా బాకీ ఉన్న హామీలను తెలియజేసేలా ప్రత్యేక బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాలని కేటీఆర్ ఆదేశించారు.
సెప్టెంబర్ 3న రైతాంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రైతులు, వ్యవసాయదారులు, రైతుకూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రైతు సదస్సులు నిర్వహించాలని తెలిపారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, యూరియా, పంటల బీమా వంటి కీలక అంశాలపై రైతులతో చర్చించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు అర్బన్ ప్రాంతాల్లో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై ప్రత్యేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
4న మహిళలు, వికలాంగులు తదితర వర్గాలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తులం బంగారం వంటి అంశాలతోపాటు ఇతర సంక్షేమ హామీల అమలు పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో వినూత్నంగా వంటావార్పు వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. 5న విద్యార్థులు, యువత సమస్యలపై ప్రత్యేకంగా పోరాట కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్, ఉద్యోగాల కల్పనతోపాటు యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువతతో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ఆదిలాబాద్‌లో సీసీఐ సమస్యలు, సింగరేణి ప్రాంతాల్లో ఆయా వర్గాల సమస్యలపై ప్రత్యేక నిరసన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు.
6న హైదరాబాద్‌లో నగర సమస్యలపై ఆటోలతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించాలని కేటీఆర్ తెలిపారు. తాగునీరు, వీధిదీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖానాల నిర్వహణ వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. అదేరోజు మిగిలిన నియోజకవర్గాల్లో పల్లెల పరిస్థితి, పడకేసిన పారిశుద్ధ్య వ్యవస్థ, గ్రామీణ ప్రాంతాల సమస్యలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు కేటీఆర్. 7న జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తిని వ్యక్తం చేసే వేదికగా ఉపయోగించుకోవాలని కేటీఆర్ సూచించారు. అన్ని జిల్లా, మండల ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యం, ప్రజలకు జరిగిన మోసంపై ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.
వారం రోజుల కార్యక్రమాల అనంతరం 8న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు నిర్వహించి, ఆయా జిల్లాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలు, ప్రజల నుంచి వచ్చిన స్పందన, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని సూచించారు. అదే సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని కోరారు. 10న జరగనున్న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ సంఘీభావం ప్రకటించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ చేపట్టనున్న ఈ వారం రోజుల కార్యాచరణను విజయవంతం చేయడంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు విస్తృతంగా, ప్రజల భాగస్వామ్యంతో, సాధ్యమైనంత వినూత్నంగా నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలోని వైఫల్యాలు, అమలు కాని హామీలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల ముందుకు తీసుకు రావడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ మొత్తం కార్యక్రమాలను పార్టీ కేంద్ర కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి కార్యక్రమంపై నివేదికలు తీసుకోవడంతో పాటు పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేసి నాయకులకు అవసరమైన మార్గదర్శకాలు అందజేస్తామని చెప్పారు. పార్టీ నిర్దేశించిన కార్యాచరణను ప్రతి ఒక్కరూ తమ తమ కార్యక్షేత్రాల్లో విజయవంతం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

















