BRS : హైదరాబాద్ : రోజు రోజుకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి అభ్యంతరకరమైన భాషను వాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది భారత రాష్ట్ర సమితి పార్టీ. ఈ మేరకు బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ తమ పార్టీకి చెందిన అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను వ్యక్తిగత దూషణలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. రాజకీయాలు చేయడంలో తప్పు లేదని, కానీ అప్రజాస్వామికమైన రీతిలో పదజాలం వాడడం దారుణమన్నారు.
BRS Party Gives Complaint to EC on CM Revanth Reddy
ప్రధానంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అత్యంత అసభ్యకరమైన, నిందారోపణాత్మక, వ్యక్తిత్వాన్ని దూషించే వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) బహిరంగంగా ధిక్కరించి ప్రత్యర్థి నేతలపై వ్యక్తిగతంగా, అవమానకరంగా మాట్లాడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడమే కాకుండా ఓటర్లలో ద్వేషం, అనుచిత భావోద్వేగాలు రేకెత్తించే విధంగా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. ఉప ఎన్నికను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారిలో బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ ఉన్నారు.
Also Read : Minister Ponnam Prabhakar Important Update : రవాణా శాఖ గౌరవాన్ని పెంపొందించాలి
















