హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి, అజాత శత్రువుగా పేరు పొందిన టి. జీవన్ రెడ్డి ఎట్టకేలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయన ఎవరూ ఊహించని రీతిలో గులాబీ కండువా కప్పుకున్నారు. త్వరలోనే ఆయన లక్ష మంది సాక్షిగా కేసీఆర్ సమక్షంలో అధికారికంగా తీర్థం పుచ్చుకోనున్నారు. 40 ఏళ్ల పాటు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఆయనకు ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ లేకుండా పోయిందని, సీనియర్లకు గౌరవం ఉండడం లేదంటూ వాపోయారు. చివరకు ఆత్మ గౌరవం లేని చోట తాను ఉండలేనంటూ కుండ బద్దలు కొట్టారు. ఆపై కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ ఆయన నేరుగా రాజకీయ పరంగా ప్రత్యర్థి అయినప్పటికీ , చిరకాల స్నేహితుడైన మాజీ సీఎం , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను వ్యక్తిగతం కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను, పార్టీ వర్గాలను షేక్ చేస్తున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసిన సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు.ఈ సందర్భంగా మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ దంపతులు వసంత సురేశ్, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆ దేవుడే నన్ను నీ వద్దకు వెళ్లమని పంపించాడని అన్నారు .
