టాస్క్ లు ట్విస్టుల‌తో హోరెత్తిస్తున్న బిగ్ బాస్ -10 షో

'డాగర్ టాస్క్'లో అమాన్ , త్రిగుణ్ మధ్య ఘర్షణ

hellotelugu-BigBoss10

హైద‌రాబాద్ : తెలుగు బుల్లితెర‌పై మ‌రోసారి దూసుకు పోతోంది అక్కినేని నాగార్జున హోస్ట్ గా నిర్వ‌హిస్తున్న ప్ర‌ముఖ రియాల్టీ షో బిగ్ బాస్ -10 . రోజు రోజుకు టాస్క్ లు, ట్విస్టుల‌తో జ‌నాన్ని ఆక‌ట్టుకుంటోంది. ఇక టీఆర్పీ రేటింగ్ లో సైతం టాప్ లో ఉండ‌డం విశేషం. ఇక తాజాగా బిగ్ బాస్ తెలుగు 10 ఎపిసోడ్‌లో జరుగుతున్న టాస్క్ కోసం ఇంటి సభ్యులు రెండు జట్లుగా విడి పోయారు. డాగర్లను (కత్తులను) సేకరించి తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు పోటీదారులు తీవ్రంగా ప్రయత్నించడంతో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది.

వారాంతం నాటికి తమ వద్ద కనీసం రెండు కంటే ఎక్కువ డాగర్లు ఉండేలా చూసుకోవాలని బిగ్ బాస్ పోటీదారులను ఆదేశించారు. ఈ టాస్క్ త్వరగానే తీవ్రరూపం దాల్చింది, పలువురు పోటీదారులు వాదోపవాదాలకు దిగారు. ఒకరి దగ్గర ఉన్న డాగర్‌ను మరొకరు తీసుకునే ప్రయత్నంలో అమాన్ , త్రిగుణ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. డాగర్లపై పట్టు సాధించేందుకు రెండు జట్లు ప్రయత్నించడంతో ఇతర ఇంటి సభ్యులు కూడా ఇందులో జోక్యం చేసుకున్నారు. ఆ గొడవ మరింత ముదరకుండా రోహిత్ , ఇతరులు ఆపే ప్రయత్నం చేశారు.

ఇదే సమయంలో, కెప్టెన్సీ గది నిర్వహణ తీరుపై అపూర్వ ప్రశ్నలను ఎదుర్కొన్నారు. డాగర్ టాస్క్ ఇంకా కొనసాగుతుండగా పోటీదారులను ఆ గదిలోకి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని శాలిని ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్‌లో నరేష్‌కు సంబంధించిన ఒక సరదా సన్నివేశం కూడా చోటు చేసుకుంది. గొడవలో పాల్గొనమని ముఖేష్ ప్రోత్సహించినప్పటికీ నరేష్ ఆ తర్వాత పరిస్థితిని తమాషాగా మాట్లాడుతూ తోటి సభ్యులను నవ్వించారు.

‘ఫైర్ అండ్ లావా’ అనే మరో కెప్టెన్సీ టాస్క్‌లో ఒక సవాలుతో కూడిన పనిని పూర్తి చేయడానికి రెండు జట్లు పోటీపడ్డాయి. వర్షిణి , నరేష్‌లను సంచాలకులుగా నియమించారు. టాస్క్ సమయంలో వర్షిణి తీసుకున్న నిర్ణయాలను త్రిగుణ్ ప్రశ్నించగా ఆటలో సృష్టికి గాయమైంది. చివరికి ఈ టాస్క్ డాగర్లకు సంబంధించి మరో కీలక నిర్ణయానికి దారితీసింది. జట్టులో చర్చల అనంతరం, సృష్టి దగ్గర కాకుండా దెబ్జానీ దగ్గర నుండి డాగర్‌ను తీసుకోవాలని అమాన్ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం రామ్ ప్రసాద్‌ను నిరాశపరిచింది , ఇంటి సభ్యుల మధ్య మరో చర్చకు దారితీసింది.

Exit mobile version