హైదరాబాద్ : ఇండియన్ టెక్కీ ఎక్సపర్ట్స్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ప్రధానంగా ప్రవాస భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ వస్తున్న అమెరికా ప్రభుత్వానికి ప్రత్యేకించి ఆ దేశాధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఫెడరల్ కోర్టు. హెచ్ 1 బి వీసాలపై భారీ ఫీజు విధించడాన్ని తప్పు పట్టింది. ఈ మేరకు స్టే విధించింది. ఇది ఎంతమాత్రం చెల్లుబాటు కాదని పేర్కొంది కోర్టు. దీంతో భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట లభించిందని చెప్పక తప్పదు. కార్యనిర్వాహక, శాసనసభల మధ్య అధికారాలను వేరుచేసే ఒక కీలక రాజ్యాంగ సూత్రం ఆధారంగా ఈ తిరస్కరణ జరిగింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం, కొత్త పన్ను విధించే అధికారం కేవలం శాసనసభ అయిన కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వం శాసనసభ ఆమోదం లేకుండా ఈ పన్నును విధించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
ఇది ప్రజాస్వామ్యంలో అధికారాల విభజనకు సంబంధించి ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తుందని కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ ప్రభుత్వం ఈ పన్నును వీసాల ప్రాసెసింగ్ కోసం విధించే ఒక పరిపాలనా రుసుము అని పిలిచినప్పటికీ, అమెరికా న్యాయవ్యవస్థ దానిని పన్నుగా పరిగణించి, చట్ట విరుద్ధమని ప్రకటించింది. అందువల్ల ఈ తీర్పు హెచ్-1బీ వీసాలపై భారీ పన్ను విధించడానికి వ్యతిరేకంగా లేదు, కానీ కార్యనిర్వాహక వర్గం తన రాజ్యాంగ అధికార పరిధిని దాటి వ్యవహరించడానికి వ్యతిరేకంగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. కొత్త హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన $100,000 రుసుమును పునరుద్ధరించడానికి అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు నిరాకరించడంతో , భారతదేశంతో పాటు ఇతర దేశాల నుండి వేలాది మంది నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.
















