అమరావతి : నేను.. నువ్వు అనే ఆలోచనలకు స్వస్తి పలికి, మనం అనే స్ఫూర్తితో కూటమి పార్టీలు ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. భీమవరం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరడం ఖాయమని, కూటమి అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థి డాక్టర్ మల్లేశ్వరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భీమవరాన్ని అభివృద్ధికి కేరాఫ్ గా మార్చుదామని, పట్టణంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ భీమవరం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. భీమవరంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణ, ప్రచార ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి అభ్యర్థుల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు. అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడారు. భీమవరం పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించే దిశగా సమష్టిగా పని చేస్తాం అన్నారు. ముఖ్యంగా భీమవరం పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తాం అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ సమస్యను ప్రాధాన్యతగా తీసుకుని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తాం అని తెలిపారు నాగబాబు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం అన్నారు. కూటమి పార్టీల మధ్య ఎటువంటి విభేదాలకు తావులేకుండా ఐక్యంగా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళతామన్నారు.
















