హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (MEA) అనుమతి నిరాకరించడంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. అమెరికాలో పర్యటించడానికి మన ముఖ్యమంత్రికి భారత ప్రభుత్వం అనుమతి లేదా రాజకీయ పరమైన క్లియరెన్స్ నిరాకరించడం చాలా దురదృష్టకరం అని అన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఒక ప్రతినిధి బృందంతో కలిసి పర్యటించాల్సి ఉందన్నారు. కేంద్రం నిర్ణయంపై ఆయన స్పందించారు.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే తాము విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. వ్యవస్థ మొత్తాన్ని మార్చగల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచగల ఏకైక సాధనం విద్య మాత్రమేనని అన్నారు. ముఖ్యమంత్రి తన వంతుగా పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఏదో కారణంతో భారత ప్రభుత్వం ఆయనకు అనుమతి నిరాకరించడం దారణమన్నారు. ప్రభుత్వం అలా చేయడానికి నాకు ఎటువంటి సరైన కారణం కనిపించడం లేదన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా కనిపిస్తోందన్నారు. ఇది సరికాదు. తెలంగాణ కూడా ఈ దేశంలో ఒక భాగమే. తెలంగాణ అభివృద్ధి చెందితే, భారతదేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

















