Congress : ఢిల్లీ – ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాకు బీసీ సంఘాలు బేషరతుగా మద్దతు ఇస్తున్నాయని చెప్పారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ ధర్నాతో నైనా బిజెపి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలన్నారు. ప్రత్యేకంగా రెండు రోజులు పార్లమెంట్ లో చర్చ పెట్టాలన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో చట్టం చేయకపోతే తెలంగాణలో బిజెపికి రాజకీయ సమాధి తప్పదన్నారు. బీసీ రిజర్వేషన్లను పెంచే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లదేనని స్పష్టం చేశారు.
Congress – BC Groups Support
ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపు రిజర్వేషన్ల బిల్లును చట్టం రూపంలో తీసుకు రాకుంటే తెలంగాణలో కేంద్ర మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా , ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మూడున్నర నెలలు గడిచినా పట్టించు కోలేదన్నారు. ఆ బిల్లుకు ఢిల్లీలో మూలుగుతుందే తప్ప దానిని ఇప్పటి వరకు కేంద్రం పట్టించుకోకుండా అన్యాయం చేస్తుందని ఆరోపించారు.
బీసీల జనాభా 60 శాతం ఉన్నప్పటికీ 42 శాతానికే పరిమితం చేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఒక మెట్టు దిగి బీసీలు పోరాడుతున్నప్పటికీ పట్టించుకోక పోవడం దారుణమన్నారు. బిజెపి గల్లీలో ఒక విధానం, ఢిల్లీలో ఇంకొక విధానం అవలంభిస్తూ బీసీలను మోసం చేస్తోందని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్ల సాకుతో బీసీల నోటికాడు ముద్దను గుంజుకుంటే బిజెపికి తెలంగాణలో రాజకీయంగా పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.
Also Read : Minister Vasamsetti Interesting : భవన నిర్మాణ కార్మికులకు నైపుణ్య శిక్షణ


















