కరీంనగర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు అనుభవం కలిగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పార్టీలో చిన్న, పెద్ద అనే తేడా అనేది ఉండదన్నారు. జీవన్ రెడ్డి పది మందికి ఆదర్శ ప్రాయంగా ఉండాలే తప్పా ఎలా పడితే అలా మాట్లాడటం, ఇతరులను పనిగట్టుకుని దూషించడం మంచి పద్దతి కాదన్నారు. కొత్త వారికి ఛాన్స్ లు ఇవ్వాలని, వారిని తను ముందుండి ప్రోత్సహించాలని సూచించారు బల్మూరి వెంకట్. ఎంత పెద్ద వారైనా పార్టీ నిర్ణయం మేరకు నడుచు కోవాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇక్కడ ఒకరు చిన్న వారు లేదా పెద్ద వారు అనేది ఉండదన్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు బల్మూరి వెంకట్ జీవన్ రెడ్డిని ఉద్దేశించి. ఎవరైనా సరే, చివరకు నేనైనా సరే కుర్చీకి గౌరవం ఇవ్వాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు. ఎంత సీనియర్ అయినా పార్టీకి కట్టుబడి ఉండాలన్నారు. ఇందులో జూనియర్, సీనియర్ తేడా ఉండదన్నారు. ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే జగిత్యాల సంజయ్ ఇంట్లో సమావేశమైన సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై ఇంకా స్పందించ లేదు జీవన్ రెడ్డి.

















