హైదరాబాద్ : అణగారిన వర్గాల గొంతుక బాబూ జగ్జీవన్ రాం అని అన్నారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ వెంకన్న. ఆదివారం హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్ భవన్ లో మహానేత ‘బాబుజీ’ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం పని చేసిన ధీరుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ కు ఆర్టీసీ నివాళి అర్పించింది.
ఈ సందర్భంగా ఈడీ సిహెచ్. వెంకన్న మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆజన్మాంతం శ్రమించిన ధీశాలి బాబూ జగ్జీవన్ రామ్ అని అన్నారు. సామాజిక సమానత్వానికి ఆయన పునాది వేశారని కొనియాడారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాబుజీ, నాటి కాలంలో ఉన్న అస్పృశ్యత, వివక్ష వంటి సామాజిక రుగ్మతలను విద్యార్థి దశ నుంచే ధైర్యంగా ఎదుర్కొని జన చైతన్యం తెచ్చిన గొప్ప సంస్కర్త అని గుర్తుచేశారు. కేవలం నిరసన తెలపడమే కాకుండా, అధికారంలోకి వచ్చి వ్యవస్థను మార్చాలని నమ్మిన ఆయన, ఐదు దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్ గా చట్టసభల్లో తన ముద్ర వేశారని వెంకన్న పేర్కొన్నారు.
దేశాభివృద్ధి అంటే కేవలం భవనాలు నిర్మించడం కాదు, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సమాన గౌరవం , అవకాశం లభించడమేనని నమ్మిన బాబుజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం గా ఇచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ఎందరికో ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే టీజీఎస్ఆర్టీసీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయపుష్ప, టీజీఎస్ఆర్టీసీ సీటీఎం (ఏం, సి ) శ్రీధర్, సీసీఈ కవిత, పలువురు సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
