హుజురాబాద్ : తాను బతికుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డ్ పెట్టనిచ్చే ప్రసక్తి లేదని, ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని ప్రకటించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా డంపింగ్ యార్డ్ పై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ నెల మూడున శుక్రవారం హుజురాబాద్ బంద్ విజయవంతం చేయాలని అన్నారు. గురువారం ఆయన సిర్సపల్లి సమీపంలోని డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, ఇది ప్రజల జీవిత సమస్య అని, నిజంగానే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటయితే ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుందని అన్నారు.
రైతులు మహిళలు పిల్లలు ఇబ్బందులు పడతారని, పశుపక్షాదుల ఉనికి సైతం ప్రశ్నార్థకమవుతుందని, పర్యావరణం దెబ్బ తింటుందని, ప్రజలు ముక్తకంఠంతో డంపింగ్ యార్డ్ వద్దని కోరుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కి డంపింగ్ యార్డ్ వద్దని, హుజురాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని దండం పెట్టి చెప్పానని ఆయన తెలిపారు. నాపైకోపం ఉంటే నన్ను ఉరి తీయండి.. జైలుకు పంపండి.. కానీ నా నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టద్దు.. హుజురాబాద్ గడ్డ పోరాటాల అడ్డ.. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో హుజురాబాద్ కమలాపూర్ ప్రాంతం కీలకపాత్ర పోషించిందన్నారు. ఈ ప్రాంతానికి పోరాటాలు కొత్త కాదు అని ఆయన ఉద్వేగంగా అన్నారు.
