హైదరాబాద్ : తెలంగాణ పునర్ నిర్మాణం లో ఆర్య వైశ్యలు కీలకమైన పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ . రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, ఆర్య వైశ్య ప్రముఖులు హాజరయ్యారు. ఆర్య వైశ్యు లు ఊరికి ఒక్కరు ఉన్నా ఆధిపత్యం చూపిస్తుంటారని అన్నారు. తెలంగాణ ఆర్ధిక అభివృద్ధి లో భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు సీఎం.
రాష్ట్రంలో ఆర్య వైశ్యులకు 6 మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు ఒక మేయర్ పదవి ఇచ్చి రాజకీయం గా ప్రాధాన్యత కల్పించడం జరిగిందని చెప్పారు. రాజరికం లో అధికారం మారాలంటే హింస తప్పనిసరిగా ఉండేదన్నారు. కానీ మహాత్మా గాంధీ ఒక్కరే అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని గుర్తు చేశారు సీఎం. రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం తో పారదోలిన గొప్ప వ్యక్తి, మహనీయుడు మహాత్ముడని ప్రశంసించారు రేవంత్ రెడ్డి. నాకు ఇష్టమైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అని చెప్పారు. ఆయన తో వాదించడం ,ప్రశ్నించడం గౌరవం గా ఉండేదన్నారు. రోశయ్య విగ్రహం లక్డీకాపూల్ లో పెట్టి ఆయన స్ఫూర్తి ని కొనసాగిస్తున్నాం అన్నారు.
















