అప్పలాయగుంట : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 25 నుండి జూలై 3 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ ఆదేశించారు. ఆలయ పరిసరాలు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆలయ సమీపంలోని కల్యాణ మండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల వైభవాన్ని భక్తులకు చేర వేసేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పరిసర గ్రామాల్లో ధర్మ రథంద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఎస్వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాల ప్రత్యేక ప్రోమోలు ప్రసారం చేయాలన్నారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మజ్జిగ, ప్రసాదాల పంపిణీతోపాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా జూన్ 28న కల్యాణోత్సవం, జూన్29న గరుడసేవ, జూలై 2న రథోత్సవం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలు, పుష్పాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత కళాశాల, హెచ్‌డీపీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. జూన్ 24న అంకురార్పణ, జూన్ 25న ధ్వజారోహణం, జూలై 3న చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగియనున్నబ్రహ్మోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను జేఈవో ఆవిష్కరించారు.
