అమరావతి : కాఫీ, మిరియాలు, పసుపు పంటలకు ఏపీ కేరాఫ్ గా మారాలన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2336 గిరిజన ఆవాసాలకు మిషన్ మోడ్ లో రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నాం అని చెప్పారు. 2027 నాటికి ప్రతీ గిరిజన కుటుంబానికీ సురక్షితమైన తాగునీరు, ఆవాసం కల్పిస్తాం, సోలార్ రూఫ్ టాప్ కూడా ఏర్పాటు చేస్తాం అన్నారు. అడవి తల్లి బాట పేరుతో వెయ్యి కోట్లతో 905 కిలోమీటర్ల రోడ్లు వేశాం అని చెప్పారు. డోలీ మోతలు లేకుండా ఫీడర్ అంబులెన్సులు, 108,104 మొబైల్ మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే డిజిటల్ కనెక్టివిటీ కోసం సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటించారు సీఎం. 25 ఏళ్ల క్రితమే అరకు కాఫీకి నాంది పలికాం, ఇప్పుడు ప్రపంచ బ్రాండ్ గా అరకు కాఫీ ఎదిగిందని చెప్పారు. మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాం అని తెలిపారు. కాఫీ, మిరియాలు, పసుపు లాంటి వాణిజ్య పంటలకు బ్రాండ్ గా ఏజెన్సీ మారాలని పిలపునిచ్చారు.
ప్రధాని మోదీ కూడా ఆస్ట్రేలియా ప్రధానికి అరకు కాఫీనే బహుమతిగా ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతీ అతిథికీ అరకు కాఫీని బహుమతిగా ఇస్తూ ప్రోత్సాహం కల్పిస్తున్నాం అని వెల్లడించారు. పార్లమెంటు లోనూ అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయించాం అన్నారు. బెస్ట్ గ్లోబల్ బ్రాండ్ గా దీనిని మారుస్తాం అని పేర్కొన్నారు సీఎం. గిరిజన ప్రాంతాల్లోని అటవీ ఉత్పత్తులకు విలువ జోడించటం ద్వారా మంచి మార్కెటింగ్ కల్పిస్తాం అని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్, తేనె, తాటిబెల్లం ఇలా ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్ , బ్రాండింగ్ వరకూ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఒక్క ఆదీవాసీల కోసమే 3 ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేసి వారికి ప్రాధాన్యత కల్పించాం అన్నారు. ఎటు చూసినా పచ్చదనం అలరారే ఈ ప్రాంతాల్లో పర్యాటకాన్ని కూడా గణనీయంగా ప్రోత్సహిస్తాం అని తెలిపారు సీఎం. నేడు చేసుకున్న 19 ఎంఓయూల ద్వారా 60 వేల మందికి లబ్ది కలుగుతుందని చెప్పారు .గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా 1.5 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తాం అన్నారు . ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షలకు కూడా వారిని సిద్ధం చేసి అందరితో పోటీ పడేలా ప్రోత్సహిస్తాం అని ప్రకటించారు. జీవో నెంబరు 3 ద్వారా గిరిజన ప్రాంతాల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేశాం అన్నారు. ఆదివాసీల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

















