అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకు వస్తున్న డీ లీమిటేషన్ ప్రక్రియ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి శాపంగా మార బోతోందని ఆవేదన చెందారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఈ మేరకు గురువారం షర్మిల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మూడు పేజీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం భారత జనాభాలో సుమారు 4% వాటా కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటికే 25 లోక్‌సభ స్థానాలతో పరిమిత ప్రాతినిధ్యం కలిగి ఉందన్నారు. డీలిమిటేషన్ అనంతరం సీట్ల సంఖ్య 38 వరకు పెరిగినప్పటికీ, 850 మంది సభ్యులతో విస్తరించిన సభలో మన సభ్యుల వాటా 4 శాతం కంటే తక్కువ ఉండడం దారుణమన్నారు.
ఈ ప్రాతినిధ్య తగ్గుదల కేంద్ర నిధుల కోసం చర్చించే సామర్థ్యాన్ని అనివార్యంగా బలహీన పరుస్తుందన్నారు.. కనీసం 10–15% నిధుల నష్టమే వచ్చినా, సంవత్సరానికి సుమారు ₹10,000–₹20,000 కోట్ల వరకు గ్రాంట్లు, ప్రాజెక్టులు, పెట్టుబడుల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి, విశాఖపట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కీలక ప్రాజెక్టులు నిరంతర కేంద్ర సహకారంపై ఆధారపడి ఉన్నాయన్నారు. బలహీనమైన పార్లమెంటరీ ప్రాతినిధ్యం వల్ల ఈ ప్రాజెక్టులు ఆలస్యం కావడం, నిధుల కొరత లేదా ప్రాధాన్యత తగ్గిపోవడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఆదాయ లోటు రాష్ట్రంగానే కొనసాగుతోందన్నారు. కేంద్ర నిధులపై ఆధార పడుతున్న ఈ పరిస్థితిలో రాజకీయ బలం తగ్గిపోతే రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం, సంక్షేమ కార్యక్రమాలు , దీర్ఘకాలిక అభివృద్ధి తీవ్రంగా ప్రభావితమవుతాయని పేర్కొన్నారు.
