విజయవాడ : లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టిందనే ఆరోపణలకు సంబంధించిన కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతికి ఈనెల 21 వరకు రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను కోర్టులో హాజరు పరిచారు. కోర్టు సమయం ముగియడంతో శాంతిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. రిమాండ్ విధించడంతో శాంతిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉండగా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీబీ నజర్ పెట్టింది. నిన్న మూకుమ్మడిగా దాడులు చేపట్టింది.
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న శాంతికి చెందిన ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం నాలుగుచోట్ల ఒకేసారి సోదాలు నిర్వహించారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. దీంతో వెంటనే తనను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంలోని ఎండాడలో విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ+2 భవనం ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి సోదాల్లో బయట పడింది. వీటితో పాటుగా శాంతి వద్ద రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు అకౌంట్‍లో మరో రూ.3 లక్షలు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. ఓ కారు, బైక్ కలిగి ఉన్నట్లు సోదాల్లో తేలింది.
