అమరావతి : ఏపీలో రికార్డు స్థాయిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2025-26 ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు వ్యవసాయ, ఉద్యానవన శాఖ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు సీఎం. 23 జిల్లాల్లో 2606 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు.
గత ఏడాది ఇదే సీజన్ తో పోలిస్తే 32 శాతం మేరకు ధాన్యం కొనుగోళ్లు పెరిగాయన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద 7.89 కోట్ల గోనె సంచులను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతులకు రూ.4085 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఈ ఏడాది మొత్తంగా 50.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు మానిటరింగ్ చేయాలని స్పష్టం చేశారు సీఎం.















