అమరావతి : విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించే అంశంపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇప్పటికే ఈ దిశగా చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరం చేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టే విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్ కు రూ. 4కు తగ్గించటంతో పాటు ప్రజలపై భారం వేయకుండా విద్యుత్ సంస్థల రుణాలు తీర్చేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ మేరకు సచివాలయంలో జరిగిన విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు. 2028-29 నాటికి విద్యుత్ కొనుగోళ్ల ఖర్చును తగ్గించేందుకు చేపట్టిన ప్రణాళికలను విద్యుత్ శాఖ అధికారులు సీఎం చంద్రబాబు ముందుంచారు. విద్యుత్ రంగంలోని వివిధ విభాగాల ద్వారా సంస్కరణలు చేపడితే మొత్తంగా యూనిట్ కు రూ.1.32 చొప్పున విద్యుత్ కొనుగోలు భారాన్ని తగ్గించవచ్చని సీఎంకు వివరించారు.
2028-29 నాటికి యూనిట్ కొనుగోలు ధరను రూ.4.10కు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రూ.4కు ఈ కొనుగోలు ధరను తగ్గించేలా చూడాలని సీఎం ఆదేశించారు. నూతన టెక్నాలజీని, ఇన్నోవేషన్లను వినియోగించుకుని విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. విద్యుత్ సంస్థల సమర్థ నిర్వహణతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.339 కోట్ల మేర ఆదా చేశామని…ఈ తరహా పొదుపు చర్యలను మరింతగా తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…”ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలను తెచ్చాం. దీని ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజలకు మేలు చేయడానికి రిస్క్ తీసుకుని మరీ విద్యుత్ సంస్కరణలు అమలు చేశాం. ఎనర్జీ ఆడిటింగ్ అనే విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే దేశంలో తొలిసారిగా చేపట్టాం. ఇప్పుడు విద్యుత్ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని అన్నారు సీఎం.
