అమరావతి : వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది. 24వ తేదీ నుంచి 29వ ప్రతీ రైతు ఇంటికి ప్రజా ప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుంబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొననున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు సేవా కేంద్రాల సిబ్బంది సహా 10 వేల మందితో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
అన్నదాతల సంక్షేమం కోసం, సాగు విధానంలో తీసుకు రావాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి ప్రకటించిన పంచ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై టెలీకాన్ఫరెన్స్‌లో ఆయా శాఖలకు దిశా నిర్ధేశం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మీకోసం రైతన్నా పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సేవా కేంద్రాల్లో పని చేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించనుంది. ఈ సందర్భంగా టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. 17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు ముందుకెళ్తున్నాం. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద దాదాపు 46.50 లక్షల మందికి పైగా రైతులకు రెండు విడతలుగా రూ.14 వేలు జమ చేశాం అన్నారు.
