అమరావతి : ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన సభలో 2026-2027 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మనోహర్ సహచర మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనంతగా అద్భుతంగా బడ్జెట్ ఉందన్నారు. దేశానికే ఆదర్శ ప్రాయంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. విధ్వంసం నుంచి వికాసం వైపు దారి చూపేలా బడ్జెట్ ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి క్రమశిక్షణ, ఐక్యత, సాహసోపేత నిర్ణయాలు అవసరం అన్నారు.
అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఈసారి బడ్జెట్లో కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అపారమైన అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి సర్కార్ బడ్జెట్ రూప కల్పనలో ప్రాధాన్యత రంగాలకు అత్యధికంగా నిధులు కేటాయించేలా చేశారంటూ పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. గ్రామాల అభివృద్ధికి పుష్కలంగా నిధుల కేటాయింపు వల్ల పల్లెలు పురోభివృద్ది సాగుతాయని తెలిపారు. మూల ధన వ్యయం పెంపుతో భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసాన్ని గాడిలో పెట్టేలా ప్రణాలిక తయారు చేశారన్నారు.















