తిరుమల : టీటీడీ నిత్య అన్నదానం ద్వారా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఏకంగా 4.40 కోట్ల మంది భక్తులకు ఈ ప్రసాదం అందించింది. జనవరి 1 నుండి మే 31 వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా మొత్తం 4.40 కోట్ల సర్వింగ్స్ భక్తులకు అందించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో జనవరిలో కోటి, ఫిబ్రవరిలో 71.39 లక్షలు, మార్చిలో 84.85 లక్షలు, ఏప్రిల్‌లో 85 లక్షలు, అలాగే మే నెలలో 92 లక్షలకు పైగా భక్తులకు అన్నప్రసాదం, అల్పాహారం, పానీయాలు అందించారు.
అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరు గుపరిచేందుకు టీటీడీ పలు ఆధునిక చర్యలు చేపట్టింది. చట్నీలు, కూరల తయారీలో తాజా కొబ్బరికాయల వినియోగాన్ని ప్రవేశపెట్టింది. 2024లో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించి అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీ సేవలను విస్తరించింది.అదేవిధంగా నూతనంగా ప్రారంభించిన PAC-5 (వెంకటాద్రి నిలయం)లో సుమారు 1,500 మంది ఒకేసారి భోజనం చేసే సామర్థ్యంతో కొత్త డైనింగ్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 2 లక్షల మంది భక్తులకు ఆహారం తయారు చేయగల సామర్థ్యంతో కొత్త శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్నాయి. MTVAC కిచెన్‌లో ఆధునిక వంట పరికరాల ఏర్పాటు, QR కోడ్ ఆధారిత విరాళాల సేకరణ కియోస్క్‌ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు.
