న్యూఢిల్లీ : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక అదనపు ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. మాకు సువిశాలమైన తీరప్రాంతం, శక్తివంతమైన పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విస్తతమైన పారిశ్రామిక కారిడార్లు, ప్రతిష్టాత్మకమైన పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఉందని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అమలు చేస్తున్నాం అని వెల్లడించారు. పారిశ్రామికీకరణలో వేగం, అమలు అత్యంత ముఖ్యం అని స్పష్టం చేశారు. ఇందులో న్యూక్లియర్ ఎకోసిస్టమ్ ప్రముఖ పాత్ర వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పర్యావరణ వ్యవస్థ ఆలోచనా విధానం ముఖ్యం అన్నారు. సాంకేతిక సహకారాలు, తయారీ భాగస్వామ్యాలు, సప్లై చైన్ అభివృద్ధి, ఇంజనీరింగ్ ఎకోసిస్టమ్స్, రీసెర్చ్ భాగస్వామ్యాలు, స్కిల్లింగ్, వర్క్‌ఫోర్స్ అభివృద్ధి, పారిశ్రామిక ప్రమాణాలు, భవిష్యత్ సాంకేతికల అమలుకు విశ్వసనీయ గ్లోబల్ భాగస్వాములతో పని చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు.
ఈ సమావేశం ఒక అత్యంత ముఖ్యమైన సమయంలో జరుగుతోందన్నారు నారా లోకేష్. ఇది కేవలం భారతదేశ ఎనర్జీ భవిష్యత్తుకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఎనర్జీ పరివర్తనకు సంబంధించిన అంశం కూడా. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏకకాలంలో ఆర్థికవృద్ధి, పారిశ్రామిక వ్యాప్తి, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్, డికార్బనైజేషన్ ఏవిధంగా సాధించాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాయన్నారు. క్లైమేట్ కమిట్మెంట్లను పాటిస్తూ ఏఐ యుగాన్ని ఎలా ముందుకు నడిపించాలి, అందుకు అవసరమైన విద్యుత్ ను తక్కువ ఖర్చుతో ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇంధన భద్రతను ఏవిధంగా సాధించాలనేది తక్షణ సవాళ్లుగా మారాయన్నారు నారా లోకష్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆకాంక్షలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఎనర్జీ సెక్యూరిటీ అన్నది మాకు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం అని నొక్కి చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అత్యంత కీలకమైన పారిశ్రామిక, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కేంద్రంగా మారిందన్నారు.
