కోల్ కతా : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు విండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైనల్ కు చేరింది. ఈ కీలక మ్యాచ్ లో టీమిండియా గెలుపొందడంలో ముఖ్య భూమిక పోషించాడు సంజూ శాంసన్. తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 50 బంతులు మాత్రమే ఎదుర్కొని 12 ఫోర్లు 4 సిక్సులు కొట్టాడు. 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు సంజు శాంసన్. ఈ ఇన్నింగ్స్ తన జీవితంలో మరిచి పోలేనిదని పేర్కొన్నాడు. తను క్రికెట్ రంగంలోకి వచ్చి 10 ఏళ్లవుతోందని చెప్పాడు. తాను పరుగులు చేయడం కంటే, వ్యక్తిగత రికార్డుల కంటే భారత జట్టు కోసం ఆడేందుకే ఎక్కువగా ఇష్ట పడతానని అన్నాడు సంజు శాంసన్.
తాను క్రికెట్ లో అడుగు పెట్టిన సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను చూసి పెరిగానని చెప్పాడు. వారు ఆడిన గొప్ప ఇన్నింగ్స్ ల కంటే తన ఇన్నింగ్స్ అంత గొప్పది కాదన్నాడు. నేను 60 ఆటలు ఆడి ఉండవచ్చు, కానీ 100 ఆటలలో వారు ఎంత పరిపూర్ణంగా ఉన్నారో నేను చూశానని పేర్కొన్నాడు. చాలా కాలంగా ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ వచ్చానని అన్నాడు. ఇది , ఈ విజయం తన జీవితంలో అత్యుత్తమమైన రోజుగా పేర్కొన్నాడు. ఆట అన్నాక ఒడిదుడుకులు సహజం అన్నాడు. ప్రతీసారి మైదానంలోకి దిగిన సమయంలో సెంచరీ చేయాలని ఉంటుందన్నాడు. కానీ దానికి శ్రమతో పాటు లక్ కూడా మనకు సహకరించాలని తెలిపాడు శాంసన్.
