తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. తన అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.
టిటిడి ఆలయాలకు ధ్వజ స్తంభం, రథాలు తయారు చేసేందుకు పలమనేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపామన్నారు. టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు, అవసరమైన సిబ్బంది, తదితర సౌకర్యాలను కల్పించేందుకు పాలక మండలి ఓకే చేసిందన్నారు టీటీడీ చైర్మన్.
దీంతో పాటు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు బీఆర్ నాయుడు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొరకు, ఆర్కిటిక్ట్ నియామకానికి ఆమోదం తెలిపామన్నారు. దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకు రావాలని నిర్ణయించా మన్నారు టీటీడీ చైర్మన్. తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయ పునః నిర్మాణ పనులలో భాగంగా రెండవ దశలో రూ.14.10 కోట్లు మంజూరు చేశామన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్లకు అదనంగా మరో 270 హాస్టల్ సీట్లు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.


















