న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ‘వందేమాతరం గీతాన్ని అవమానించడం దారుణమన్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతాన్ని మధ్యలోనే ఆపేయాలని కాంగ్రెస్ చూసిందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. జాతీయ గీతం ‘వందేమాతరం’ను అవమానించారని ఆరోపిస్తూ ఆ పార్టీ, సోనియా గాంధీ ప్రజలకు, అలాగే ఆ గీతాన్ని రచించిన బంకిం చంద్ర ఛటర్జీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చిత్తోర్‌గఢ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం సందర్భంగా, పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ‘వందేమాతరం’ గీతాన్ని మధ్యలోనే ఆపేయాలని కోరారని షా ఆరోపించారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా కాంగ్రెస్ ‘వందేమాతరం’ను విస్మరించిందని హోంమంత్రి విమర్శించారు. స్వేచ్చ వచ్చి 80 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఎర్రకోటతో పాటు జెండా ఆవిష్కరణ జరిగిన అన్ని చోట్ల ‘వందేమాతరం’ ఆలపించారని షా పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఈ విప్లవాత్మక నినాదం పాత్రను గుర్తు చేశారు. వందేమాతరం పాడినందుకు వేలాది మంది ప్రజలు తూటాలు, లాఠీ దెబ్బలను ఎదుర్కొన్నారు, జైలు పాలయ్యారు అని షా అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షుడిని గీతాన్ని మధ్యలోనే ఆపమని కోరారని ఆయన ఆరోపించారు. మనమందరం దీనిని టెలివిజన్‌లో చూశాము అని చెప్పిన షా, సోనియా గాంధీ ప్రజలకు , బంకిం చంద్ర ఛటర్జీ ఆత్మకు క్షమాపణ చెప్పాలని అన్నారు.
షా మాజీ ప్రధాని చేసిన కృషిని కొనియాడారు. పోఖ్రాన్ పరీక్షల తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, భారతదేశాన్ని అణు శక్తి దేశంగా మార్చడంతో సహా వాజ్‌పేయి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని షా పేర్కొన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం తన హయాంలో గ్రామాలను రోడ్లతో అనుసంధానించిందని, జాతీయ రహదారులను నిర్మించిందని, అనేక కార్యక్రమాలను ప్రారంభించిందని ఆయన చెప్పారు. గిరిజన అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత కూడా వాజ్‌పేయిదేనని ఆయన అన్నారు. గిరిజన కుటుంబం నుండి వచ్చి అత్యున్నత పదవిని అధిరోహించిన ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా ఎన్నికవడంలో గిరిజన సంక్షేమంలో సాధించిన పురోగతి ప్రతిబింబించిందని హోం మంత్రి పేర్కొన్నారు.

















