Iran : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్న వేళ, ఇప్పుడు ఈ యుద్ధంలో అమెరికా అధికారికంగా జోక్యం చేసుకుంది. తాజాగా, ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా ఫైటర్ జెట్‌లతో భారీ దాడులు నిర్వహించింది. ఈ దాడిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రాత్రి ప్రకటించారు.
America – Iran Bomb Attack
ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడులు విజయవంతంగా పూర్తయ్యాయని, దాడికి వెళ్లిన యుద్ధ విమానాలు సురక్షితంగా తిరిగి వచ్చాయని ట్రంప్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
“అన్ని విమానాలు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాయి. మన గొప్ప అమెరికన్ వారియర్లకు అభినందనలు. ప్రపంచంలో మరే సైన్యం ఇలా చేయలేదు. ఇప్పుడు శాంతికి సమయం,” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా రాత్రి 10 గంటలకు అమెరికన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు.
ఇక విషయానికి వస్తే, అమెరికా (America) ఇటీవలే ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య వివాదం దౌత్యపరంగా పరిష్కారమవ్వాలంటూ రెండు వారాల గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ, ఆ ప్రకటన చేసిన కేవలం 48 గంటల్లోపే ఇరాన్‌పై దాడి జరగడం చర్చనీయాంశమైంది. ట్రంప్ మునుపటి ప్రకటనలో “ఇరాన్‌తో చర్చలు జరగే అవకాశం ఉందని, రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటాను” అన్నారు. కానీ ఇప్పుడు నేరుగా దాడికి దిగారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఇదివరకే హెచ్చరిస్తూ, “అమెరికా దాడి చేస్తే తీవ్రంగా ప్రతీకారం తీసుకుంటాం. ఊహించని నష్టాన్ని చూపిస్తాం” అని పేర్కొన్నారు.
ఇక అమెరికా జోక్యంతో ఈ సంఘర్షణ మరింత ముదురే అవకాశముంది. రష్యా, చైనా వంటి శక్తివంతమైన దేశాలు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావచ్చని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతానికి వాతావరణం ఎంతో ఉద్విగ్నంగా మారింది. ఇకపై ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాలపై ఎంతటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.
Also Read : Amit Shah Shocking Comments : సింధు జలాల ఒప్పందంపై హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు















