అమరావతి : పార్లమెంట్ లో అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం పొందడం పట్ల స్పందించారు సీఎం చంద్రబాబు నాయుడు. రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్‌లో ఆమోద ప్రక్రియ పూర్తయినట్లేనని చెప్పారు . గురువారం సీఎం మీడియాతో మాట్లాడారు. బిల్లు పాస్ అయినందుకు ఈ రోజు సాయంత్రం అన్ని గ్రామాల్లో పండుగలా కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన రీతిలో రాజధాని సంబరాలు జరపుకునే సమయమిది అని పేర్కొన్నారు. ఇవాళ అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ప్రతి ఒక్కరూ కేంద్రానికి ధన్యవాదాలు తెలపాలని అన్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండ రాయునిపాలెనికి వెళ్తున్నానని తెలిపారు.
రాజధాని సంబరాల్లో పాల్గొంటున్నానని చెప్పారు చంద్రబాబు నాయుడు. దేశంలోని వివిధ పుణ్యస్థలాల నుంచి తెచ్చిన నీళ్లు, మట్టి ఉంచిన పవిత్ర ప్రాంతం ఉద్దండ రాయునిపాలెం అని పేర్కొన్నారు. మనం అనుకున్న అభివృద్ధి సవ్యంగా సాగాలని ప్రతి కోరుకోవాలని, సంకల్పం తీసుకోవాలని కోరారు. మన రాజధానికి స్థిరత్వం వచ్చేలా సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, మద్ధతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లు మీకు 3 రాజధానులా అని ఎగతాళిగా మాట్లాడారని వాపోయారు. ఏకైక రాజధాని నా రాజధాని అమరావతి అని గౌరవంగా చెప్పుకునే రోజు వచ్చిందన్నారు. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కూడా సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.
