అమరావతి : ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించడం అభినందించ దగ్గ విషయమని, ఈ తీర్మానం భావితరాలకు భరోసానిస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో 33 వేల ఎకరాలు సేకరించడం చరిత్రలో మొట్ట మొదటి సారన్నారు. ఇది సీఎం చంద్రబాబుకే సాధ్యమని కొనియాడారు. అమరావతికి స్వాగతిస్తున్నానని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని మభ్యపెట్టి, అధికార గర్వంతో మూడు ముక్కలాట ఆడుతూ ప్రజలను భయబ్రాంతులకు, గందరగోళాలకు గురిచేశారని జగన్ పై మంత్రి సవిత మండిపడ్డారు. అమరావతికి చట్టబద్ధతకు నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తీర్మానానికి మద్దతుగా ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత అప్పులతో నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజున లోటు బడ్జెట్ తో పాటు కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవన్నారు.
సమర్థవంతమైన నాయకత్వంలో ఏపీ 2014-19 మధ్య కాలంలో అభివృద్ధి పథం వైపు దూసుకెళ్లిందన్నారు. సీమాంధ్ర ప్రజల నూతన రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు ఎంపిక చేసినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయన్నారు. సీఎం చంద్రబాబు పిలుపునకు స్పందిస్తూ…రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంత రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు అందజేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలియ జేస్తున్నానని తెలిపారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ లో భూములు సేకరించిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. చరిత్రలో ఎక్కడా ఇలా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించిన దాఖాలాలు లేవన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడి చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగిందన్నారు. ఆయన దేశంలో ముఖ్యమైన నదుల్లో జలాలు, పుణ్యక్షేత్రాలకు చెందిన మట్టిని అందజేసి అమరావతి నిర్మాణానికి అందజేసి దీవెనలు అందజేశారన్నారు.
