అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ హయాంలోనే ప్రాజెక్టులను కట్టడం జరిగిందన్నారు. 2014-19 మధ్య సాగునీటి రంగానికి రూ.68 వేల కోట్ల వ్యయం చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గడచిన 20 నెలల్లో రూ.20 వేల కోట్లను ఈ రంగానికి వెచ్చించినట్టు తెలిపారు. 738 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువను విస్తరించి కుప్పంలో పరమ సముద్రం చెరువు వరకూ నీటిని తీసుకెళ్లామని అన్నారు. మడకశిర వరకూ నీటిని తీసుకెళ్లి ఆ ప్రాంత వాసుల దాహార్తిని తీర్చామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల న్నీ టీడీపీ, కూటమి హయాంలో నిర్మించినవేనని సీఎం స్పష్టం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుంచు కుంటున్నామని అన్నారు. ఆనాడు రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టులు చేపట్టింది ఎన్టీఆర్ అని సీఎం స్పష్టం చేశారు.
పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీరిచ్చి, శ్రీశైలంలో 100 టీఎంసీలను రాయలసీమకు తరలించామని.. అందుకే ఆ ప్రాంతం రతనాల సీమగా మారిందన్నారు. వెలిగొండ పూర్తి చేసి మార్కాపురం, ప్రకాశం జిల్లా సహా వివిధ ప్రాంతాలకు న్యాయం చేస్తామని సీఎం చెప్పారు. 30 ఏళ్లకు ముందు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని.. ఇప్పుడు ఈ ఏడాది జూలైలోనే మొదటి దశ పూర్తి చేసి నీళ్లు ఇస్తామని అన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా రూ.2500 కోట్ల మేర వ్యయం చేయాల్సి ఉందని ,రూ.456 కోట్ల వ్యయంతో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేసినట్టు వివరించారు. వెలిగొండకు నీళ్లు రాకుండానే రిబ్బన్ కట్ చేసి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం గత పాలకులు చేశారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. కుప్పంలోనూ ట్యాంకర్లు తీసుకువచ్చి కాలువలో నీళ్లు పోశారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపైనా గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని సీఎం ఆక్షేపించారు. రూ.2 వేల కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తామని వివరించారు.
















