తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే జనవరి 25వ తేది నిర్వహించనున్న రథ సప్తమి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఆయన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రథ సప్తమి విచ్చేసే భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లను చైర్మన్ వివరించారు.
శ్రీవారి ఆలయంలో వాహన సేవలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సూర్య ప్రభ వాహనం ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు, చిన్న శేష వాహనం ఉదయం 9 నుండి 10 గంటల వరకు,
గరుడ వాహనం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల దాకా, హనుమంత వాహనం మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు, చక్రస్నానం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు,
చంద్రప్రభ వాహనం రాత్రి 8 నుండి 9 గంటల దాకా ఉంటుందన్నారు.
ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి పెద్ద ఎత్తున శ్రీవారి ఆలయంలో జరిగే రథసప్తమికి భక్తులు విశేషంగా హాజరవుతారని తాము భావిస్తున్నట్లు చెప్పారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈ సందర్బంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.



















