అమరావతి : అన్న క్యాంటీన్లకు నిరంతరం ఆహార సరఫరా చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 25 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ 500 కోట్ల భోజనాలను సరఫరా చేసిందన్నారు. అన్న క్యాంటీన్లలో రూ.5కే అందిస్తున్న భోజనం పేద వాళ్లు, ఆటోడ్రైవర్లు, ముఠా కార్మికులు, కూలీలకు ఆసరాగా నిలుస్తోందని ప్రశంసించారు. పేదవాళ్లకు వచ్చే కొద్దిపాటి డబ్బులతో బయట హోటల్‌లో తినడం ఆర్ధికంగా ఎంత భారమో నాకు తెలుసు అని అన్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో వారి డబ్బు ఆదా అయ్యి ఇతర అవసరాలకు ఉపయోగ పడుతుందన్నారు. అన్నక్యాంటీన్లలో సరఫరా చేసే భోజనానికి రుచి, శుభ్రత, నాణ్యతకే ప్రధమ ప్రాధాన్యం ఉంటుందన్నారు.
ఉదయం అల్పాహారం, మద్యాహ్నం, రాత్రి భోజనాలతో మూడు పూటలా ఆకలి తీర్చుకునే అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు సీఎం . ఒక్కో అన్న క్యాంటీన్‌లో రోజుకు సగటున 1,013 మంది ఆహారాన్ని తీసుకుంటున్నారని అన్నారు. దీని నిర్వహణ కోసం రూ.26,250 ఖర్చు అవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మంది భోజనాలు చేస్తున్నారని తెలిపారు. దీనికోసం రోజుకు రూ.54 లక్షలకు పైగా వ్యయం అవుతోందన్నారు. ఇప్పుడు కొత్తగా పెట్టిన 62 గ్రామీణ అన్న కాంటీన్లలో ఆహార సబ్సిడీకి రోజుకు మరో రూ.18 లక్షలు, ఏడాదికి రూ.58 కోట్లు అవుతోందన్నారు చంద్రబాబు నాయుడు. కొత్త క్యాంటీన్ల నిర్మాణానికి రూ.43 కోట్ల వ్యయం అయ్యిందన్నారు. గడచిన 21 నెలల్లో అన్నక్యాంటీన్లలో 8.80 కోట్ల భోజనాలు చేశారన్నారు. ఇప్పటి వరకూ అన్నక్యాంటీన్ సబ్సిడీ కోసం రూ.243 కోట్ల మేర ఖర్చు చేశాం అని ముఖ్యమంత్రి చెప్పారు.
