AI Market : భారత్ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అద్భుతమైన మార్కెట్‌గా ఎదుగుతోందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. వచ్చే 12 నుంచి 18 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 82 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు ఏఐ నైపుణ్య శిక్షణ అందించేందుకు సిద్ధమవుతుంటే, భారత్‌లో ఈ సంఖ్య 93 శాతం వరకు పెరిగిందని ఆయన వెల్లడించారు.
ఏఐ (AI Market) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, అప్లికేషన్స్ ఇంజనీర్లు అవసరమవుతారని చందోక్ అన్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కోడింగ్‌లో దాదాపు 30 శాతం పనిని ఏఐ సాయంతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సంస్థ కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ రంగాల్లో 300 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించారు.
AI Market- ఉద్యోగాలపై ఏఐ ప్రభావం
ఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతాయన్న ఆందోళనలను చందోక్ తోసిపుచ్చారు. కొన్ని సాంప్రదాయ ఉద్యోగాలు తగ్గినా, ఏఐ ఆర్కెస్ట్రేటర్, ఏఐ ఏజెంట్ మేనేజర్, ఏజెంట్ బాస్, ప్రాంప్ట్ ఇంజనీర్ వంటి కొత్త వృత్తులు విస్తృతంగా పుట్టుకొస్తాయని తెలిపారు. యువతకు పూర్తి స్థాయి ఏఐ నైపుణ్యాలను అలవర్చుకోవడం తప్పనిసరిగా మారుతుందని ఆయన సూచించారు.
భవిష్యత్ లక్ష్యాలు
అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం ఇవ్వకపోయినా, ఆర్థిక భాగస్వామ్యం ప్రపంచ పురోగతికి తోడ్పడుతుందని చందోక్ అభిప్రాయపడ్డారు. రాబోయే ఐదేళ్లలో భారత్‌లో కోటి మందికి ఏఐ శిక్షణ ఇవ్వాలనే లక్ష్యాన్ని మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.
Also Read : Stock Market Sensational : స్టాక్ లు కొనేటపుడు ఆచితూచి వ్యవహరిం చాలంటున్న నిపుణులు



















