అమరావతి : బీసీల సంక్షేమానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని వెల్లడించారు. సచివాలయంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం నేతలు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, జాతీయ అధ్యక్షుడు జే. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో నేతలు సీఎంకు విజ్ఞాపన పత్రాలను అందించారు. జనాభా దామాషా ప్రాతిపదికన తమకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కేంద్రంతో చర్చించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా త్వరితగతిన తేవాలని కోరారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు, కేంద్రంతో మాట్లాడి ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయించడంతో పాటు, ఓబీసీ సబ్ ప్లాన్ రూపొందించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగాల నియామకాలలో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని బీసీ సంఘం నేతలు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఏపీ బీసీ సంఘం నేతల నుంచి విజ్ఞాపన పత్రాలను తీసుకున్న ముఖ్యమంత్రి కేంద్రం పరిధిలో ఉన్న అంశాలను వారితో సంప్రదించి నెరవేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. బీసీలకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బీసీల అభ్యున్నతి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఈ సందర్భంగా నేతలు ముఖ్యమంత్రితో అన్నారు. బీసీలకు ప్రభుత్వం అందిస్తూన్న ఆదరణ, చేనేతలకు ఉచిత విద్యుత్, మత్య్సకారులకు వేట నిషేధ భృతి, 217 జీవో రద్దు, కల్లు గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు, వడ్డెరలకు మైనింగ్‌లో రిజర్వేషన్లు వంటి వాటిని తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని బీసీ నేతలు వ్యాఖ్యానించారు.
