హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినన్ని నిధులు మంజూరు చేయడం లేదని ఆవేదన చెందారు. తాము పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రులను పదే పదే కలిసినా , విన్నవించినా ఇప్పటి వరకు దయ చూపడం లేదంటూ వాపోయారు. విద్యా పరంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందులో భాగంగా తెలంగాణకు తక్షణమే సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని విన్నవించారు పీఎంను. ఇదిలా ఉండగా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరపున పలు విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు రేవంత్ రెడ్డి. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ కు మార్చాలని కోరారు. తెలంగాణలో పదేళ్లుగా ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే వికారాబాద్ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ కు మూడు వేల ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు రేవంత్ రెడ్డి.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా ( తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్), డీజీపీ శివధర్ రెడ్డి, పలువురు రాష్ట్ర ప్రభుత్వ, ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
