తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. ఆయన కొలువు తీరాక టీటీడీలో ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు. ఈసారి వైకుంఠ ద్వార దర్శనంకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్బంగా టీటీడీ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాలపై ఫోకస్ పెట్టారు ఈవో. దేశంలోని వివిధ ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టిటిడి కల్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదికను రూపొందించాలని అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.
టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన అంతర్గత ఆడిట్ సమావేశంలో ఆయన సమీక్ష చేపట్టారు . ఈవో మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు టిటిడి కల్యాణ మండపాలు ఆదరణలో ఎన్ని ఉన్నాయి, ఆదరణ లేనివి ఎన్ని, ఆధునీకరించబడినవి ఎన్ని, తదితర స్థితిగతులు, భక్తులు సౌకర్యవంతంగా వినియోగించు కోవడానికి సమగ్ర విధానాన్ని రూపొందించి టిటిడి పాలక మండలికి నివేదించాలని తిరుపతి జేఈవో వి. వీరబ్రహ్మంను ఆదేశించారు. టిటిడి ఆలయాలలోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసి డాక్యుమెంటను రూపొందించాలన్నారు. అలాగే, టిటిడిలోని అన్ని విభాగాలలోని మౌలిక వసతులకు సంబంధించి టూల్స్ అండ్ ప్లానింగ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.



















