హైదరాబాద్ : బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తి వచ్చే త్రైమాసికం నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ప్రారంభించనుంది. భారత ఎలక్ట్రిక్ బస్ రంగంలో తొలిసారిగా ఒలెక్ట్రా అభివృద్ధి చేసిన బ్లేడ్ బ్యాటరీ ప్యాక్‌కు లభించిన సర్టిఫికేషన్ సంస్థకు కీలక మైలురాయిగా నిలిచిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు వెల్లడించారు. ఇది సంస్థ టెక్నాలజీ ఆధారిత వృద్ధి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. శుభ్రమైన, సమర్థవంతమైన , సుస్థిర మొబిలిటీ పరిష్కారాల ద్వారా దేశంలో విద్యుత్ వాహన రంగంలో వస్తున్న మార్పులకు ఒలెక్ట్రా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
అగ్రగామి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ, ఎం ఈ ఐ ఎల్ అనుబంధ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓ జి ఎల్ ), గత ఏడాది డిసెంబర్ 31 తో ముగిసిన మూడో త్రైమాసికం, తొమ్మిది నెలల సమీకృత ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను అదే రోజున జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఆమోదించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మీడియాతో మాట్లాడారు. బ్లేడ్ బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానంతో నూతన బస్సుల ఉత్పత్తి ప్రణాళికను వెల్లడించారు.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ అత్యుత్తమ పనితీరును కనపరిచిందని చెప్పారు. ఈ ఒక్క త్రైమాసికంలోనే అత్యధికంగా 385 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసిందన్నారు. దీంతో సంస్థ కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ డెలివరీలు సంస్థ కార్యనిర్వహణ సమర్ధతకు నిదర్శనంగా నిలిచాయని అన్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే డెలివరీలు 37 శాతం పెరిగినట్లు తెలిపారు.
