విశాఖపట్నం జిల్లా : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రవాణా రంగంలో ప్రధానమంత్రి ఈ బస్ సేవ తో నూతన శకం మొదలు అయ్యిందన్నారు. శనివారం విశాఖపట్నం జిల్లాలోని విశాఖ నగరంలో సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్‌ను ప్రారంభించారు. ఈసందర్బంగా మంత్రి ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకు రావడం జరిగిందని చెప్పారు మంత్రి. ఇందులో భాగంగా విశాఖకు 100 బస్సులు కేటాయించామని అన్నారు. త్వరలోనే విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు వంటి నగరాలకు ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని వెల్లడించారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. ఎలక్ట్రిక్ వాహనాలు వాడడం వల్ల పర్యావరణానికి హాని ఏమాత్రం కలగదన్నారు.
PM e-Bus Sewa’ పథకం కింద ఏర్పాటవుతున్న సింహపురి ఈ-బస్సు డిపోను పరిశీలించడం జరిగిందని తెలిపారు . విశాఖకు కేటాయించిన 100 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ఆధునిక పవర్ రూమ్ సిద్ధమైందని , ఇందు కోసం భారీ ఎత్తున ఖర్చు చేశామన్నారు పవర్ రూమ్‌తో పాటు సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలు వేగంగా పూర్తి చేసినట్లు తెలిపారు. మరో రెండు నుంచి మూడు నెలల్లో ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు. ఈ-బస్సులు రాక నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి తొలి దశలో 750 ఈ-బస్సులు వచ్చాయని, అందులో విశాఖకు 100 బస్సులు కేటాయించినట్లు తెలిపారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. ప్రస్తుత బస్సులతో పాటు కొత్త ఈ-బస్సులతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం అన్నారు.

















