న్యూఢిల్లీ : మా దృష్టిలో డేటా సెంటర్ అంటే కేవలం సర్వర్లతో కూడిన భవనాలకు ఆతిథ్యం ఇవ్వడం కాదు. డేటా సెంటర్ ఎకోసిస్టమ్ చుట్టూ తయారీ ఎకోసిస్టమ్ కూడా నిర్మించాలన్నదే మా లక్ష్యం అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. మేం కేవలం భూమి, విద్యుత్ గురించి మాత్రమే ఆలోచించడం లేదన్నారు. ఫుల్ స్టాక్ గురించి ఆలోచిస్తున్నాం అన్నారు. కూలింగ్ సిస్టమ్స్ ను స్థానికంగా తయారు చేయడం, పవర్ ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్‌లను నిర్మించడం, ట్రాన్స్‌ఫార్మర్స్ తయారీని ప్రోత్సహించడం, బ్యాటరీ స్టోరేజి సప్లయ్ చైన్స్, సెమీకండక్టర్-అనుసంధాన పరిశ్రమలను ఆకర్షించడంపై మేం దృష్టి సారించాం అన్నారు. ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నీషియన్లు, ఎనర్జీ ఇంజనీర్లు, ఆధునిక తయారీ వర్క్ ఫోర్స్ కోసం స్కిలింగ్ సంస్థలను నిర్మించడం ద్వారా ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం అన్నారు లోకేష్.
ప్రాజెక్టుల వారీగా కాకుండా వివిధ దశల్లో క్లస్టర్లవారీగా సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు. చరిత్రలో పారిశ్రామికంగా విజయం సాధించిన దేశాలు, ప్రాంతాలు విడివిడిగా పెట్టుబడులపై కాకుండా మొత్తం వాల్యూ చైన్‌లతో అభివృద్ధి చెందినవేనని పేర్కొన్నారు. మేము ఏఐ, క్లీన్ ఎనర్జీ అవకాశాలను కూడా అదేవిధంగా అంది పుచ్చుకుంటున్నాం అన్నారు. న్యూక్లియర్ ఎనర్జీ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను కూడా అదే కోణంలో చూడాలని నేను నమ్ముతున్నాను అని తెలిపారు. అయితే తరచుగా న్యూక్లియర్ ఎనర్జీ గురించిన చర్చలు కేవలం ఉత్పత్తి సామర్థ్యంపైనే కేంద్రీకృతమవుతాయని తెలిపారు. కానీ అసలైన అవకాశం అంతకంటే చాలా పెద్దది. న్యూక్లియర్ ఎనర్జీ ఒక పూర్తి పారిశ్రామిక ఎకోసిస్టమ్‌గా మారుతుందన్నారు.
