అమరావతి : బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నా శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని పొగాకు రైతులు, చిరు వ్యాపారులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుస్తుందని పేర్కొన్నారు. పొగాకు HS కోడ్ 2401 కిందకు వచ్చే, రీటైల్ విక్రయాల కోసం ప్యాక్ చేయని అన్ బ్రాండెడ్ ముడి పొగాకుపై ఇకపై ఎలాంటి ఎక్సైజ్ డ్యూటీ వర్తించదని స్పష్టం చేశారు. గతంలో అస్పష్టమైన నిబంధనల వల్ల రైతులు, వ్యాపారులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ గెజిట్‌తో తొలగిపోతాయని చెప్పారు. అయితే బ్రాండెడ్‌గా ప్యాక్ చేసిన పొగాకు ఉత్పత్తులపై 18 శాతం ఎక్సైజ్ సుంకం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయంతో పన్నుల విషయంలో స్పష్టత, పారదర్శకత పెరుగుతాయని, రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మార్పులతో ముడి పొగాకు సరఫరా వ్యవస్థకు ఉపశమనం లభిస్తుందని, ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి భంగం కలగదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ప్యాకింగ్, రీటైల్ విక్రయాలపై పన్ను వర్తింపుపై ఉన్న సందేహాలు ప్రస్తుత గెజిట్‌తో పూర్తిగా తొలగి పోయాయని అన్నారు. బల్క్ ముడి పొగాకుపై ఎలాంటి పన్ను లేకపోవడం వల్ల రైతులకు నేరుగా లాభం చేకూరుతుందని, మెరుగైన ధర లభించే అవకాశం ఉందన్నారు. అలాగే బ్రాండెడ్ ఉత్పత్తుల పేరుతో జరిగే దుర్వినియోగానికి ఈ కొత్త మార్గదర్శకాలు అడ్డుకట్ట వేస్తాయని మంత్రి పేర్కొన్నారు.
