తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల ఏర్పాటు చేసి, శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుమలలోనే వైభవంగా నిర్వహించే విధానానికి బాటలు వేసిన మహనీయుల్లో భగవద్ రామానుజాచార్యులు ప్రముఖులు. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఆయన క్రమబద్ధీకరించిన అనేక కైంకర్యాలు, ఆగమ సంప్రదాయాలు, ఉత్సవ విధానాలు నేటికీ తిరుమల శ్రీవారి ఆలయ వ్యవస్థలో కొనసాగుతున్నాయి. తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల ఏర్పాటులో రామానుజాచార్యుల పాత్ర విశిష్టమైనదిగా ఆలయ చరిత్ర తెలియ జేస్తోంది. గతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎనిమిది రోజులపాటు తిరుచానూరులో నిర్వహించేవారని సంప్రదాయ కథనాలు చెబుతున్నాయి. నాలుగు మాడ వీధుల ఏర్పాటు అనంతరం బ్రహ్మోత్సవాలను తిరుమలలోనే నిర్వహించే విధానం ఏర్పడింది.
శ్రీవారి ఉత్సవమూర్తి మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ ఊరేగే సంప్రదాయం క్రమంగా తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మారింది. నేడు వాహన సేవలు, ఊరేగింపులు, భక్తుల దర్శనం వంటి అనేక కార్యక్రమాలకు ఈ నాలుగు మాడ వీధులే ప్రధాన వేదికగా నిలుస్తున్నాయి. ఇటీవలే తిరుమలలో వీధులు, కూడళ్లకు శ్రీవారి సేవలో తరించిన దేవతలు, దైవాంశ సంభూతులు, పురాణ పురుషులు, రాజులు, పండితుల పేర్లను పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా భగవద్ శ్రీ రామానుజాచార్యుల వారి సేవలకు గుర్తుగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాంగణానికి శ్రీ రామానుజాచార్యుల ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయ నాలుగు మాడ వీధులలో తూర్పు మాడ వీధినకి ఋగ్వేద మార్గం, దక్షిణ మాడ వీధికి యజుర్వేద మార్గం, పడమర మాడ వీధికి సామవేద మార్గం, ఉత్తర మాడ వీధికి అథర్వణ వేద మార్గంగా నామకరణం చేయడం జరిగింది.
వైఖానస ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయంలో నిర్వహించాల్సిన కైంకర్యాలు, ఆచార వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను జీయర్లకు అప్పగించడం ద్వారా రామానుజాచార్యులు కీలకమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆధ్వర్యంలో వెంకటనాథ శఠగోప యతి లేదా జీయర్ మఠం తిరుమలలో ఏర్పాటైంది. ఆళ్వార్ల దివ్య ప్రబంధంలోని శ్రీవేంకటేశ్వర స్వామికి సంబంధించిన 250కు పైగా పాశురాల పారాయణాన్ని ఆలయంలో ప్రవేశపెట్టారు. ఇందుకోసం ఆచార్య పురుషులను నియమించారు. అలాగే ఇతర మఠాలకు చెందిన పీఠాధిపతులు, జీయర్లు లేదా సన్యాసులు తిరుమల ఆలయానికి విచ్చేసినప్పుడు పూర్ణకుంభ స్వాగతం పలికి, తీర్థం, ప్రసాదం, శేషవస్త్రం సమర్పించే సంప్రదాయాన్ని రామానుజాచార్యులే ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. గోదా కల్యాణం, తన్నీరముదు ఉత్సవం, భగ్ సవారి ఉత్సవం వంటి పలు ఉత్సవాలను కూడా ఆయన ప్రవేశపెట్టినట్లు ఆలయ చరిత్ర తెలియజేస్తోంది.
తిరుమల శ్రీవారిని దర్శించు కునేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించే విధానానికి కూడా రామానుజాచార్యులు ప్రాధాన్యత ఇచ్చారు. స్వామివారికి సమర్పించే నైవేద్యాలను ఆలయ వంటశాలలోనే సిద్ధం చేయాలని, వాటిని శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే వంటవారితో తయారు చేయించాలని నిర్దేశించారు. గుడాన్నం, చిత్రాన్నం, పాయసం, అతిరసం, అప్పం, దోశ తదితర నైవేద్యాలను స్వామివారికి సమర్పించే సంప్రదాయాన్ని ఆయన ప్రోత్సహించారు.తిరుమల ఆలయంలో వివిధ దేవతామూర్తుల ప్రతిష్ఠలోనూ రామానుజాచార్యుల సేవలు విశిష్టమైనవి. సీతాదేవి, భూదేవి, శ్రీయోగ నరసింహస్వామి విగ్రహాలను రామానుజాచార్యులవారు స్వయంగా పంచలోహంతో రూపొందించి ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. తిరుమల ఆలయంలో ఇతర దేవతామూర్తుల అర్చామూర్తులు ఉన్నప్పటికీ సీతాదేవి అర్చామూర్తి లేకపోవడంతో రామానుజాచార్యులు సీతాదేవి పంచలోహ విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. అనంతరం సీతారాముల కల్యాణాన్ని కూడా నిర్వహించారు.
శ్రీవైష్ణవ సంప్రదాయంలో వరాహ, నరసింహ, రామ, కృష్ణ అవతారాలకు ప్రత్యేక స్థానం ఉంది. రామానుజాచార్యుల కాలంలో తిరుమలలో నరసింహస్వామికి ప్రత్యేక ఆలయం లేకపోవడంతో, స్వామి పుష్కరిణి సమీపంలో ఉన్న సుమారు మూడు అడుగుల ఎత్తైన నరసింహస్వామి విగ్రహాన్ని గుర్తించి, ఆయన కోసం మండపాన్ని నిర్మించినట్లు చెబుతారు. ప్రస్తుతం యోగ నరసింహస్వామి సన్నిధి తిరుమల ఆలయంలోని ప్రముఖ ఉపాలయాల్లో ఒకటిగా ఉంది. వరాహ పురాణంలోని ఒక ఘట్టాన్ని స్మరించుకుంటూ, రామానుజాచార్యులు భూదేవి అర్చామూర్తిని పూలబావిలో ప్రతిష్ఠించినట్లు ఆలయ సంప్రదాయం తెలియజేస్తోంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఏకాంతంలో ఉన్న సమయంలో తొండమాన్ చక్రవర్తి అనుకోకుండా వారి ఏకాంత ప్రదేశంలోకి ప్రవేశించిన సందర్భానికి సంబంధించిన కథనం ఆధారంగా ఈ అర్చామూర్తిని ఏర్పాటు చేసినట్లు చెబుతారు.
కాలానుగుణంగా ఆలయ నిర్వహణలో అనేక మార్పులు చోటుచేసుకున్నప్పటికీ, రామానుజాచార్యులు నిర్దేశించిన ప్రధాన ఆగమ సంప్రదాయాలు, కైంకర్యాలు, సేవలు, నియమ నిబంధనలు నేటికీ తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఆలయాల్లో కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయ వ్యవస్థను క్రమబద్ధీకరించి, కైంకర్యాలకు పటిష్టమైన పునాది వేసిన రామానుజాచార్యుల సేవలు, శ్రీ వేంకటేశ్వరస్వామివారిపై ఆయనకు ఉన్న అపారమైన, అవిచ్ఛిన్నమైన భక్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.



















