న్యూఢిల్లీ : ఏపీ పర్యాటక రంగానికి మహర్దశ పట్టనుంది. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ ఏపీని టూరిజం హబ్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీలో పర్యటించారు. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో మంత్రి నూతన ప్రాజెక్టుల సాధన దిశగా చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయి. అందులో ప్రధానంగా ప్రసాద్ , స్వదేశ్ దర్శన్ పథకాల కింద రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, బీచ్‌ల అభివృద్ధికి నిధులు రాబట్టేందుకు చేసిన ప్రయత్నంలో మంత్రి దుర్గేష్ విజయం సాధించారు.
ఆధ్యాత్మిక పర్యాటకం: ప్రసాద్ పథకం కింద మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (రూ. 95.18 కోట్లు), అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం (రూ. 213.72 కోట్లు), వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం (రూ. 120 కోట్లు), కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (రూ. 36 కోట్లు), నెల్లూరు గృహ మల్లేశ్వర స్వామి ఆలయం (రూ. 48.95 కోట్లు) అభివృద్ధి చేసేందుకు నిధులు ఇవ్వాలని కోరారు.
బీచ్ , ప్రకృతి పర్యాటకం, చారిత్రక ప్రాధాన్యతకు సంబంధించి మచిలీపట్నంలో వైబ్రెంట్ బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం రూ. స్వదేశ్ దర్శన్ 2.0 కింద 120.04 కోట్లు, లంబసింగిలో పర్యాటక అనుభూతిని మెరుగు పరిచే పనులకు రూ. 99.87 కోట్లు, బౌద్ధ క్షేత్రాల వద్ద టెంట్ సిటీల ఏర్పాటుకు రూ. 77.32 కోట్లు, లేపాక్షిలో పర్యాటక సౌకర్యాలు, సాంస్కృతిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 103.05 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
















