అమరావతి : ఏపీ రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున మూడు రోజుల పాటు ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహితోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ విభాగంలో పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్ ,ఏపీటీఏ సీఈఓ, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాటా , టీమ్ వర్క్ ఆర్ట్స్ కంపెనీ ప్రొడ్యూసర్ శ్యామ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహితోత్సవంపై పలు అంశాలను వివరించారు.
తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో “ఆవకాయ్ సినిమా సంస్కృతి & సాహిత్యోత్సవం”ను విజయవాడ వేదికగా నిర్వహిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఈ సాంస్కృతిక ఉత్సవం ద్వారా తెలుగు కళా వారసత్వానికి ఘనమైన వేదిక కల్పించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 8,9,10 తేదీలలో విజయవాడలోని పున్నమి ఘాట్ , భవానీ ఐల్యాండ్లలో మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుందని చెప్పారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ప్రవేశం పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని ప్రకటించారు.
సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకరంగం, కవిత్వం, సాంస్కృతిక చర్చలు వంటి విభిన్న కళారూపాలను ఒకే బహిరంగ వేదికపైకి తీసుకు రావడమే ఆవకాయ్ ఉత్సవం ఉద్దేశం అని తెలిపారు మంత్రి. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మకతకు పెద్దపీట వేసేలా ఈ వేడుక రూపుదిద్దుకుందని అన్నారు.















