టీటీడీ ఆధ్వ‌ర్యంలో దివ్య ఔష‌ధ వ‌నం

రూ.4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో ఏర్పాటు

hellotelugu-TTDPlants

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండలకు మరో మణిహారం చేరనుంది. భారతీయ సాంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే ఔషధ మొక్కల సంరక్షణ లక్ష్యంగా తిరుమలలో టీటీడీ రూ.4.25 కోట్లతో దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అంతరించి పోతున్న ఔషధ మొక్కలకు జీవనాడిగా దీనిని అభివృద్ది చేసేందుకు శ్రీ‌కారం చుట్టింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అరుదైన, అంతరించి పోతున్న ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్న శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేసేందుకు టీటీడీ సంకల్పించింది.

ఔషధ మొక్కలను సంరక్షిస్తూ, ప్రజలకు పరిచయం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. తద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ లక్ష్యాలకు దివ్య ఔషధ వనం తోడ్పడనుంది. దక్షిణ భారతదేశంలోనే ఈ తరహాలో రూపొందనున్న ఈ ఔషధ వనం భక్తులు, పరిశోధకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని వెల్ల‌డించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఈ ప్రాజెక్టు కోసం రూ. 4.25 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేశారు. ఇందుకు సంబంధించి టీటీడీ ప్ర‌త్యేక స‌మావేశంలో చ‌ర్చించారు. దీనిని ఏక‌గ్రీవంగా టీటీడీ పాల‌క మండ‌లి ఆమోదం తెలిపింది.

Exit mobile version