హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న తీరు పట్ల మరోసారి మండిపడ్డారు. గురువారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.సాగునీటిపై శాసన సభలో బీఆర్‌ఎస్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని సర్కార్ ను కోరారు. సభా పరంగా రాజ్యాంగం పలు హక్కులను కల్పించిందన్నారు. అందరు ఎమ్మెల్యేలకు సమాన హక్కులు ఉన్నాయని, ప్రతిపక్షాన్ని వాస్తవాలు చెప్పడానికి అనుమతించాలని స్పష్టం చేశారు కేటీఆర్. ప్రభుత్వం సాగునీటి సమస్యలపై తన ప్రజెంటేషన్‌ను ఇస్తే, అసెంబ్లీలో తమ పార్టీకి కూడా సమాన అవకాశం ఇచ్చి, సొంత ప్రజెంటేషన్ చేయడానికి అనుమతించాలని అన్నారు.
ఇదిలా ఉండగగా సీఎం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రికి, సాధారణ శాసన సభ్యుడికి మధ్య ఎలాంటి తేడా ఉండదని రామారావు నొక్కి చెప్పారు. సభలో అందరు ఎమ్మెల్యేలకు సమాన హక్కులు ఉంటాయని ఆ విషయం సీఎం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రభుత్వం తన వాదనను వినిపిస్తే, ప్రతిపక్షాన్ని కూడా తమ వాస్తవాలను చెప్పడానికి అనుమతించాలని ఇది సభా ధర్మం అని స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా, బీఆర్‌ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యవసాయం, సాగునీటి రంగం ఎలా రూపాంతరం చెందాయో వివరించడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు మాజీ మంత్రి.

















