ఖేలో తెలంగాణ నిరంతర క్రీడా ఉద్యమానికి ఊతం

పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి

hellotelugu-KheloIndia

హైద‌రాబాద్ : తెలంగాణలో క్రీడా సంస్కృతిని మరింత విస్తరించడంతో పాటు ప్రజల దైనందిన జీవితంలో శారీరక చైతన్యాన్ని పెంపొందించడం , ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ‘ఖేలో తెలంగాణ’ పేరుతో నిరంతర కార్యక్రమాలను క్రీడా శాఖ (తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో) రూపొందిస్తోంది. దీనిలో భాగంగా క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ‘ఖేలో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారులు ఎ.పి. జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ డాక్టర్ సోనీ బాలదేవి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి , క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు పాల్గొన్నారు.

నిరంతర ప్రక్రియగా సాగే ‘ఖేలో తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా ‘ఖేలో తెలంగాణ బంధన్’ ద్వారా ప్రజలు తమ ఆరోగ్యం , ఫిట్‌నెస్ కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించేలా ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వయసుతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ తగిన శారీరక వ్యాయామాన్ని అలవాటు చేసుకునేలా ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుతున్నారు. ‘ఖేలో తెలంగాణ బంధన్’లో భాగంగా ‘9+9+9 ఫిట్‌నెస్ ఛాలెంజ్’ నిర్వహించ బడుతోంది. వాకింగ్, జాగింగ్, యోగా వంటి కార్యకలాపాలలో పాల్గొని, దానికి సంబంధించిన 27 సెకన్ల వీడియోను సోషల్ మీడియా వేదికలలో పోస్ట్ చేయడం, 9 మంది స్నేహితులను ట్యాగ్ చేయడం, మరో 9 మందిని ఈ ఛాలెంజ్‌కు ఆహ్వానించడం వంటి అంశాలతో ఈ కార్యక్రమం రూపొందించారు.

ఈ ఫిట్‌నెస్ సందేశం ఒకరి నుండి మరొకరికి వ్యాపించేలా ఈ కార్యక్రమాన్ని తీర్చి దిద్దుతున్నారు. ‘ఖేలో తెలంగాణ’ను కేవలం ఒక కార్యక్రమంగానే కాకుండా నిరంతర క్రీడా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లేందుకు, వివిధ క్రీడా విభాగాలలో లీగ్ పోటీలను ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుండి అన్ని వయసుల వారికి క్రీడలలో పాల్గొనే అవకాశాలను పెంచడం, అలాగే వివిధ క్రీడా విభాగాలపై అవగాహన, ఆసక్తి , ప్రేక్షకుల మద్దతును విస్తరించడం ఈ లీగ్‌ల ప్రధాన ఉద్దేశ్యం. రెజ్లింగ్, బాక్సింగ్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, జూడో, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, సైక్లింగ్, యోగాసనాలు , మరికొన్ని క్రీడలలో ఈ పోటీలను నిర్వహించాలని క్రీడా ప్రాధికార సంస్థ యోచిస్తోంది.

ప్రజల జీవనశైలిలో ఫిట్‌నెస్‌ను భాగం చేయడం, క్రీడలను అందరికీ చేరువ చేయడం, క్రీడా ప్రతిభకు వేదికలు కల్పించడం, తెలంగాణలో బలమైన క్రీడా సంస్కృతిని నిర్మించడం అనే లక్ష్యాలతో “ఖేలో తెలంగాణ” ద్వారా దశలవారీగా, నిరంతర కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో క్రీడాభిమానులు, అథ్లెట్లు, విద్యార్థులు, యువత, విద్యాసంస్థలు, క్రీడా సంఘాలు, ఫిట్‌నెస్ ప్రియులు, యావత్ తెలంగాణ క్రీడా సమాజం భాగస్వాములు కావాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.

Exit mobile version